paruchuri: 'సమరసింహా రెడ్డి' టైటిల్ విషయంలో గోపాల్ ను అలా ఒప్పించాను: పరుచూరి గోపాలకృష్ణ
- విజయేంద్రప్రసాద్ 'సమర సింహం'టైటిల్ పెట్టారు
- దర్శక నిర్మాతలు అదే టైటిల్ పెడదామన్నారు
- నేను మాత్రం అందుకు ఒప్పుకోలేదు
బాలకృష్ణ హీరోగా .. బి.గోపాల్ దర్శకుడిగా 1999లో వచ్చిన 'సమరసింహా రెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్ గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారు 'సమరసింహం' అనే పేరు పెట్టారు.'అలా వద్దండి 'సమరసింహా రెడ్డి' అని పెడదామని నేను అన్నాను'.
నిర్మాత చెంగల వెంకట్రావు కూడా 'సమర సింహం' అనే టైటిల్ నే పెడదామని అన్నారు. అయినా నేను ఒప్పుకోలేదు. అప్పుడు గోపాల్ కూడా 'సమర సింహం' టైటిల్ బాగానే వుంది కదండీ' అన్నాడు. 'బ్రదరూ .. సింహం మృగం .. దానికి ఎవరిని చంపాలి .. ఎవరిని చంపకూడదు అనే విచక్షణ వుండదు .. అందరినీ చంపేస్తుంది. కానీ 'సమర సింహా రెడ్డి' మనిషి .. శిక్షించడమే కాదు .. క్షమించడమూ తెలిసినవాడు " అని చెప్పాను .. అప్పుడు ఆయన ఓకే అనేశాడు" అంటూ చెప్పుకొచ్చారు.