Gujarath: ముగ్గురు ఉద్యోగులకు బెంజ్‌కార్లు బహుమతిగా ఇచ్చిన వజ్రాల వ్యాపారి!
- ఒక్కొక్కటీ కోటి రూపాయల ఖరీదు
- 25 ఏళ్లుగా తనవద్ద పనిచేస్తున్న వారికోసమీ కానుక
- గతంలోనూ ఉద్యోగులకు భారీ కానుకలిచ్చిన వ్యాపారి
ఉద్యోగులే సంస్థ అభివృద్ధికి పట్టుగొమ్మలని వందశాతం నమ్మే యజమానుల్లో గుజరాత్‌కు చెందిన వజ్రాలవ్యాపారి సావ్జి దోలకియా ముందు వరుసలో ఉంటారు. ఏటా తన సిబ్బందికి ఖరీదైన కానుకలు అందించి వారిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అటువంటి ఘనతనే నమోదు చేశారు. తన వద్ద 25 ఏళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు ఒక్కొక్కటి కోటి రూపాయల ఖరీదు చేసే బెంజ్ జీఎస్ఎల్ ఎస్యూవీ కార్లను బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచారు.
సూరత్‌లో ఘనంగా నిర్వహించిన ఈ బహుమతుల ప్రదానోత్సవానికి గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్, మధ్యప్రదేశ్ గవర్నర్ హాజరై బహుమతులు అందించారంటే ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఇక, బహుమతి గ్రహీతల వివరాల్లోకి వెళితే... హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్టు కంపెనీలో వీరు ముగ్గురూ సీనియర్ ఉద్యోగులు. నీలేష్ జాదా (40), ముఖేష్చందర్ (38), మహేష్చందపర (43)లు 13 నుంచి 15 ఏళ్ల వయసులో ఉండగా ఈ వజ్రాల వ్యాపారి కంపెనీలో చేరారు.
‘డైమండ్స్ కట్ చేయడం నేర్చుకునే పనిలో వీరిని చేర్చుకున్నాను. ప్రస్తుతం కంపెనీలో సీనియర్ ఉద్యోగులు. పైగా ఎంతో నమ్మకస్తులు. అందుకే వీరికి ఈ భారీ నజరానా’ అంటూ దోలకియా తన సిబ్బందిపై అభిమానాన్ని చాటుకున్నారు. గతంలోనూ దోలకియా ఖరీదైన బహుమతులు అందించి తన సిబ్బందిని ఆశ్చర్యపరిచారు.
2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు బహుమతులు అందించాడు. కొందరికి ప్లాట్లు, కొందరికి కార్లు, మరికొందరికి బంగారం ఇలా... భారీ నజరానాలు అందించేందుకు ఏకంగా 51 కోట్ల రూపాయలు ఖర్చుచేశాడు దోలకియా. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్టు కంపెనీలో మొత్తం 5500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కంపెనీ వార్షిక టర్నోవర్ 6 వేల కోట్ల పైమాటే. 1977లో గుజరాత్లో అడుగుపెట్టిన దోలకియా వజ్రాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తాడు.