Uttam Kumar Reddy: సిగ్గులేకుండా శంకుస్థాపనలు చేస్తున్నారు... గవర్నర్, ఈసీ ఏం చేస్తున్నారు?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మోడల్ కోడ్ అమల్లో ఉన్నా... మంత్రులు శంకుస్థాపనలు చేస్తున్నారు
- రాష్ట్రపతి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతాం
- కూటమిలోకి మరికొన్ని పార్టీలు వస్తున్నాయి
మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ రద్దైన తర్వాత మోడల్ కోడ్ అమల్లోకి వస్తుందని... ఎలాంటి అధికారికి కార్యక్రమాలను చేపట్టడానికి వీలుండదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ, తెలంగాణ శాసనసభ రద్దైన తర్వాత కూడా టీఆర్ఎస్ మంత్రులు సిగ్గులేకుండా ఏ విధంగా శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రశ్నించారు. శంకుస్థాపనలు జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు ఊరుకుంటోందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. హైదరాబాదులో మహాకూటమి అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా శంకుస్థాపనలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కూటమిలోని అన్ని పార్టీల నేతలు కలసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని రాబోతున్నామని చెప్పారు.
అన్ని జిల్లాల్లో ఈవీఎంల చెకింగ్ ప్రారంభమైందని... కొత్త జిల్లాల కలెక్టర్లు ఈ విషయంపై ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ను అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రజలంతా... ఈవీఎంల చెకింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహాకూటమిలోకి మరికొన్ని పార్టీలు కూడా రాబోతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలకు తొత్తులుగా ఉండవద్దని అధికారులందరినీ హెచ్చరిస్తున్నామని చెప్పారు.