wife: నవ వధువుపై అత్తింటి వారి సామూహిక అత్యాచారం!
- నవ వధువుపై భర్త, ఆయన తండ్రి, సోదరుడు, తాంత్రికుడు అత్యాచారం
- పూజల కోసం తాంత్రికుని పిలిచిన భర్త
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి
సభ్యసమాజం తలదించుకునే మరో దారుణ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. మంచి సంబంధం అని చెప్పి కూతురికి పెళ్లి చేసి పంపిన తల్లిదండ్రులకు.. అత్తారింట తమ కూతురు సామూహిక అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి వారి హృదయాలు బద్దలయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, కురుక్షేత్రలోని బాబైన్ కు చెందిన 22 ఏళ్ల అమ్మాయికి సెప్టెంబర్ 12న ఓ వ్యక్తితో పెళ్లి అయింది. 13వ అత్తారింటికి పంపారు.
వెళ్లిన రెండు రోజులకే 'మీ అమ్మాయికి బాగోలేదు' అంటూ అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. కూతురికి ఏమైందోనని భయపడి హుటాహుటిన అక్కడికి వెళ్లిన తండ్రికి.. నిస్సహాయ స్థితిలో స్పృహలేకుండా కూలబడిపోయి వున్న కూతురు కనిపించింది. తర్వాత ఆమె స్పృహలోకి వచ్చాక, విషయం ఆరా తీస్తే.. ఆ కూతురు చెప్పిన విషయం విని కూలబడిపోయాడు ఆ తండ్రి.
ఈ నెల 13న ఓ తాంత్రికుడిని పిలిచి పూజలు చేశారని, అదే సమయంలో తనతో ఏదో తాగించడంతో మత్తులోకి జారుకున్నానని కూతురు చెప్పింది. ఆమె మత్తులో వుండగా భర్త సోదరుడు, ఆడపడుచు భర్త తనపై అత్యాచారం చేశారని, ఆ మర్నాడు కూడా కొన్ని పూజలు చేసి, మళ్లీ భర్త, మామగారు, తాంత్రికుడు తనపై అత్యాచారం చేశారని బోరున విలపిస్తూ ఆమె చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అత్తగారు, ఆడపడుచులకు కూడా ఈ ఘటనలో ప్రమేయం వుందని పేర్కొన్నాడు.
దీంతో పోలీసులు కేసును యమునానగర్ పోలీస్ స్టేషన్ కు బదలాయిస్తూ, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆమె వద్ద నుంచి నమూనాలను సేకరించామని, నివేదిక రాగానే భర్తతో పాటు ఆమె బంధువులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, ఆమెపై వారంతా ఎందుకు సామూహిక అత్యాచారం చేశారు? ఆ తాంత్రిక పూజలు ఎందుకు నిర్వహించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావలసివుంది.