babu mohan: హరీష్ రావు రమ్మంటేనే టీఆర్ఎస్ లో చేరా.. టీఆర్ఎస్ నాకు టికెట్ ఎందుకివ్వలేదో త్వరలోనే చెబుతా: బాబూమోహన్
- కేటీఆర్ ను అడిగితే.. కేసీఆర్ ఫోన్ చేస్తారని చెప్పారు
- 20 రోజులు ఎదురు చూసినా ఫోన్ రాలేదు
- మోదీ, అమిత్ షాల నాయకత్వంలో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నా
తాను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ఎన్టీఆరే కారణమని మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ అన్నారు. మంత్రి హరీష్ రావు ఆహ్వానిస్తేనే తాను టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ ను అడిగితే... మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేస్తారని చెప్పారని అన్నారు. 20 రోజులు ఎదురు చూసినా కేసీఆర్ నుంచి ఫోన్ రాలేదని తెలిపారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఎందుకివ్వలేదో త్వరలోనే బయటపెడతానని చెప్పారు.
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల నాయకత్వంలో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని బాబూమోహన్ తెలిపారు. బీజేపీలో పని చేసే అవకాశం వచ్చిందని... పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేస్తానని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడ నుంచి పోటీ చేయడానికైనా సిద్ధమేనని చెప్పారు. మహాకూటమి పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతోందని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బాబూమోహన్ ఈరోజు బీజేపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.