gold: ఒక్కరోజులోనే రూ. 1,100 పెరిగిన వెండి ధర!
- ఇటీవలి కాలంలో తగ్గుతూ వచ్చిన ధర
- శనివారం నాడు భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
- రూ. 39 వేలు దాటిన వెండి ధర
ఇటీవలి కాలంలో తగ్గుతూ వచ్చిన వెండి ధర, శనివారం నాడు ఏకంగా రూ. 1,100 పెరిగింది. గురు, శుక్ర వారాల్లో రూ. 300, రూ. 450 మేరకు తగ్గిన వెండి ధర తరువాత భారీగా పెరిగింది. దీంతో వెండి ధర మరోసారి రూ. 39 వేల మార్క్ ను దాటేసి, రూ. 39,100కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వేత్తల నుంచి డిమాండ్ రావడంతోనే ధర పెరిగినట్లు బులియన్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, బుధవారం నుంచి జరిగిన ట్రేడింగ్ ను పరిశీలిస్తే, రూ. 425 మేరకు తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 31,500కు చేరింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర 0.83శాతం పెరిగింది. ఔన్సు బంగారం ధర 1,192.20 డాలర్లకు చేరగా, వెండి ధర కూడా 2.85శాతం పెరిగి ఔన్సుకు 14.64 డాలర్లకు చేరింది.