TJS: పాలమూరులో టీజేఎస్ ‘ప్రజాగర్జన’ నేడు.. హాజరుకానున్న ఆర్ఎల్డీ నేత అజిత్సింగ్!
- మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో ప్రాధాన్యం
- సీట్ల అంశంపై స్పష్టత వచ్చే అంశం
- కోదండరామ్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్న భావన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలమూరులో నేడు టీజేఎస్ ప్రజాగర్జన సభ జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు తదితర అంశాలపై స్పష్టమైన ప్రకటన కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్న వేళ సభకు హాజరవుతున్న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ కీలక అంశాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ సభకు ఆర్ఎల్డీ నేత అజిత్సింగ్ కూడా హాజరుకానుండడం విశేషం. సాయంత్రం నాలుగు గంటలకు పాలమూరు జెడ్పీ మైదానంలో సభ జరగనుంది.
మహాకూటమిలో టీజేఎస్ భాగస్వామి అయిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశంపై స్పష్టత లేకపోవడంతో చర్చసాగుతోంది. ఈ సభ ద్వారా జనసమితి రాజకీయ వ్యూహం, పొత్తుద్వారా దక్కనున్న సీట్లు, పోటీ చేసే అభ్యర్థులపై కోదండరామ్ స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయించకుంటే స్వతంత్ర అభ్యర్థులుగానైనా రంగంలోకి దిగాలన్న ఒత్తిడి పార్టీ వర్గాల నుంచి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో పాలమూరు సభ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ సభ పూర్తయిన అనంతరం సోమవారం కరీంనగర్లో ఐదువేల మంది కళాకారులతో తెలంగాణ ధూంధాం నిర్వహిస్తామని టీజేఎస్ నిర్వాహకులు తెలిపారు.