Maharashtra: శరద్ పవార్‌కు మరో షాక్.. ఎన్సీపీకి రాజీనామా చేసిన పార్టీ జనరల్ సెక్రటరీ
- రాఫెల్ డీల్ విషయంలో మోదీ ప్రభుత్వానికి పవార్ అండ
- పార్టీలో గుస్సా.. పార్టీని విడిచిపెడుతున్న నేతలు
- పార్టీ వేరేవారి నియంత్రణలో ఉందన్న మునాఫ్ హకీం
రాఫెల్ డీల్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన తారిఖ్ అన్వర్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా మహారాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీల్లో ఒకరైన మునాఫ్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని శరద్ పవార్ కాకుండా మరెవరో నడిపిస్తున్నట్టు ఉందని ఆరోపించారు. గత కొన్నేళ్లుగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయన్నారు. దీనివల్ల పార్టీ నియంత్రణ మరెవరి చేతుల్లోనే ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలన్న నిర్ణయాన్ని పార్టీ 2014లోనే తీసుకుందన్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ అనుకూల రాగం అందుకుందని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. తీవ్ర మనస్తాపంతోనే పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేసిన ఆయన భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించలేదు.