polavaram: ‘పోలవరం’ నిర్వాసితులకి మనమంతా రుణపడి ఉన్నాం: పవన్ కల్యాణ్
- వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి
- పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది?
- కాంట్రాక్టర్లను మార్చే ఆసక్తి, పరిహారం చెల్లింపుపై లేదు
మన తాగు నీటి అవసరాలు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు వారి జీవితాలు పణంగా పెట్టిన పోలవరం బాధితులకి మనమంతా రుణపడి ఉన్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని రాజారాణి కళ్యాణ మంటపంలో పోలవరం భూ నిర్వాసితులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. నిర్వాసితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. భూ నిర్వాసితులు తమకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, చేస్తున్న అన్యాయాన్ని ఆయనకు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘నిర్వాసితులను ఆదుకోవడం ప్రజలందరి సమష్టి బాధ్యత. రోడ్ల విస్తరణలో, జాతీయ ప్రాజెక్టుల కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి అంతే స్థాయి జీవితాన్ని ఇవ్వడం అందరి బాధ్యత. నిర్వాసితుల్ని ఆర్థికంగా ఆదుకోకపోతే వారికి ద్రోహం చేసిన వారిమవుతాం’ అని అన్నారు. భూ నిర్వాసితులకి పరిహారం ఇవ్వకుండా, న్యాయం చేయకుండా పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. పోలవరం బాధితులకి 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం మాట వినని పక్షంలో కలిసి వచ్చే పార్టీలతో ‘పోలవరం’పై నిరసన యాత్ర చేస్తామని హెచ్చరించారు. ఇన్ని లక్షల మంది జీవితాలు త్యాగం చేస్తే, ఇళ్లు వాకిళ్లు వదిలేసి ముందుకొస్తే ఎవరూ వారి గోడు వినే పరిస్థితి లేదని, చింతలపూడి రైతులు ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే రైతులకి బాకీ ఉన్నట్టు బాకీ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాంతం వారికి ఒక తరహా పరిహారం, ఇంకో ప్రాంతం వారికి ఇంకో తరహా పరిహారం ఏంటి? గిరిజనులు ఏం పాపం చేశారు? గిరిజనులు మన దేశ పౌరులు కాదా? వారికి అదే తరహా పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
కొన్ని కులాలను ఆదుకుని, కొన్ని తెగలను వదిలేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ముఖ్యమంత్రి ఓ కులానికో, ప్రాంతానికో ముఖ్యమంత్రి కాదని, ఇలాంటి వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ఓ పెద్దన్నగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాధ్యత తీసుకోకపోగా, అస్సలు పట్టించుకోకపోతే ఎలా? పోలవరం నిర్వాసితుల కష్టాలు తెలుసుకునేందుకు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.
నేతలు వేల కోట్లు... అధికారులు వందల కోట్లు మింగేస్తున్నారు
పోలవరం బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ పెట్టింది సమస్యలు వినడానికి మాత్రమే కాదని, వాటికి పరిష్కారాలు కూడా వెతకడానికని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రైతులను ఢిల్లీ తీసుకెళ్లి ధర్నాలు చేయించడం ఏంటి? అని ప్రశ్నించారు.
‘ప్రజలకు ముఖ్యమంత్రి అండగా నిలబడాలి. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలి. నిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రాజెక్టు ఎలా ప్రారంభమవుతుంది? ఇప్పటి వరకు నాలుగు శాతం కుటుంబాలకు మాత్రమే పరిహారం అందింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతిపెద్ద పెట్టుబడి రూ.35 వేల కోట్లు నిర్వాసితుల కిచ్చే పునరావాస ప్యాకేజే. పాలకులకు కాంట్రాక్టర్లని మార్చేందుకు ఉన్న ఆసక్తి, నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంపై లేదు, ఇంత మంది కన్నీళ్లపై ప్రాజెక్టు ఎలా కడతారు?
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఉద్యోగాలు ఇస్తాం, చిన్నపాటి రాయితీలతో కూడిన పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తాం. కష్టమే అయినా అండగా నిలబడతా. డబ్బులు ఇవ్వలేని పక్షంలో బాకీ పత్రాలు అందజేస్తాం. రాజకీయ నాయకులు లక్షల కోట్లు, వేల కోట్లు తినేస్తుంటే, అధికారులు వందల కోట్లు మింగేస్తున్నారు. నిర్వాసితులకు ఇవ్వడానికి మాత్రం డబ్బు ఉండదు. మీ హక్కుల కోసం చేసే పోరాటానికి మద్దతు ఇస్తాను. మీకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.