suicide: ఆస్తి కోసం యువకుడి ప్రేమ పెళ్లి నాటకం.. ప్రాణాలు తీసుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్!

  • హైదరాబాద్ లోని మణికొండలో దారుణం
  • సగం ఆస్తి కోసం భర్త, అత్త వేధింపులు
  • తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి

నువ్వంటే ప్రాణం అని చెప్పాడు. నువ్వు లేకుంటే బతకలేను అని అన్నాడు. చివరికి అతని మాటలు నమ్మిన యువతి కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టిన సదరు ప్రబుద్ధుడు, ఆస్తిలో సగం వాటా రాసివ్వాలని వేధించసాగాడు. దీంతో అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు వేధింపులు భరించలేక యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని మణికొండలో చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దక్షిణపు వీధికి చెందిన పసుపులేటి రూపిణి(25) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మణికొండ ప్రాంతంలో సందీప్ రాజ అనే వ్యక్తి జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దూరపు బంధువు కావడం, ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడంతో తండ్రి తొలుత అంగీకరించనప్పటికీ రూపిణి తల్లిదండ్రులను ఒప్పించింది. చివరికి ఈ ఏడాది మార్చి 4న పెళ్లి చేసుకున్న వీరు మణికొండలోని చిత్రపురి కాలనీలో కాపురం పెట్టారు.

ఆరు నెలల తర్వాత కుమారుడి వద్దకు చేరుకున్న తల్లి లలిత ఆస్తి కోసం కోడలు రూపిణిని వేధించసాగింది. తల్లిదండ్రుల పేరుపై ఉన్న ఆస్తిలో సగం తీసుకురావాలని అత్త, భర్త ఒత్తిడి చేయడంతో రూపిణి తట్టుకోలేకపోయింది. ఈ విషయం తండ్రికి చెప్పడంతో ఆయన వచ్చి సముదాయించి వెళ్లారు. ఆయన ఏలూరులో అడుగుపెట్టేలోపే మళ్లీ వేధిస్తున్నారని ఫోన్ చేసి కన్నీరుమున్నీరయింది. దీంతో తండ్రి హుటాహుటిన మణికొండలోని ఇంటికి చేరుకున్నారు. నిన్న ఉదయం అత్త లలిత, భర్త సందీప్ గుడికి వెళ్లగా, తండ్రి టిఫిన్ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అంతలోనే రూపిణి ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూపిణి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News