nandamuri: నందమూరి హరికృష్ణ ఉన్నట్టయితే ఈ పాటికి రియాక్టయ్యే వారు: మంత్రి తలసాని
- కాంగ్రెస్-టీడీపీ బంధంపై బాలకృష్ణ సమాధానం చెప్పాలి
- దీనిపై బాలకృష్ణ కచ్చితంగా ఆలోచించాలి
- టీడీపీని కాంగ్రెస్ కు చంద్రబాబు తాకట్టుపెట్టారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తుపై మంత్రి తలసాని స్పందించారు. ఈ విషయమై విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్-టీడీపీ బంధంపై తెలంగాణలో పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ సమాధానం చెప్పాలని అన్నారు. దీనిపై బాలకృష్ణ కచ్చితంగా ఆలోచించాలని.. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం కరెక్టా? కాదా? అన్నది ఆయన చెప్పాలని, ఇంతకన్నా ఎక్కువగా తాను వ్యాఖ్యలు చేయదలచుకోలేదని, అదే, నందమూరి హరికృష్ణ బతికి ఉన్నట్టయితే ఈ పాటికి రియాక్టయ్యే వారని అన్నారు.
తెలంగాణలో ఏర్పడింది మహాకూటమి కాదని, అదో ముఠా అని, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ టీడీపీ కేవలం సీట్ల కోసం కాంగ్రెస్ తో కలుస్తోందని, టీడీపీని కాంగ్రెస్ కు చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్, కోదండరామ్ పార్టీలు మహాకూటమిలో ఉన్నా ఫరక్ పడదు (ప్రభావం ఏమీ ఉండదు) కానీ, ఆ కూటమిలో టీడీపీ ఉండటం దారుణమని, దీని ప్రభావం ఏపీలో జరగనున్న ఎన్నికలపై పడుతుందని అభిప్రాయపడ్డారు.