prabha: నా చిన్నప్పుడే గుమ్మడిగారిని వేషం అడిగాను: సీనియర్ నటి ప్రభ
- చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం
- నాటకాలు వేసే దానిని
- ఒకసారి గుమ్మడి గారు కలిశారు
కథానాయికగా తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ప్రభ నటించారు. అప్పట్లో అగ్ర కథానాయకుల సరసన నటించి అనేక విజయాలను అందుకున్నారు. అలాంటి ప్రభ తాజాగా 'ఆలీతో సరాదాగా ' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అన్నా .. నటనన్నా చాలా ఇష్టం. అందువలన వాటిని నేర్చుకుంటూ వుండే దానిని.
ఒకసారి గూడూరు పరిషత్ నాటకాలకు వెళ్లాను. 'సత్య హరిశ్చంద్రుడు'లో 'లోహితాస్యుడు' పాత్రను పోషించడానికిగాను నేను వచ్చాను. అక్కడికి గుమ్మడి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. గుమ్మడిగారు నా నటన చూసి నన్ను ఎత్తుకుని 'చాలా బాగా చేసింది మా 'తెనాలి' అమ్మాయి' అని మెచ్చుకున్నారు. ఆయన అక్కడి నుంచి వెళుతూ వుంటే గట్టిగా పంచ పట్టుకుంటే వెనక్కి తిరిగారు. 'నాకు కూడా సినిమాల్లో చేయాలని వుంది' అని అన్నాను. చిన్నపిల్ల వేషాలు ఏమైనా ఉంటే చెబుతాలే' అని అన్నారంటూ నవ్వేశారు.