MVVS Murthy: విశాఖ వాసులకు ఆయన 'గోల్డ్ స్పాట్' మూర్తి!
- విశాఖను పారిశ్రామికంగా, విద్యా నిలయంగా మార్చిన నేత
- బాట్లింగ్ కంపెనీ ఏర్పాటుతో వ్యాపార రంగంలోకి ఎంవీవీఎస్ మూర్తి
- ఆపై పలు ప్రాంతాల్లో కళాశాలల ఏర్పాట్లు
విశాఖపట్నం అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. నగరాన్ని పారిశ్రామిక కేంద్రంగా, విద్యానిలయంగా మార్చిన తొలి తరం నేతల్లో ఆయన ఒకరు. ఆయనే మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి. ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదుగానీ, గోల్డ్ స్పాట్ మూర్తి అంటే మాత్రం విశాఖలో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం మూలపాలెం గ్రామంలో జన్మించిన మూర్తి, కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆపై ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత, హైకోర్టులో న్యాయవాదిగానూ పనిచేశారు. ఆపై వ్యాపార రంగంలో కాలుమోపి, విశాఖపట్నంలో బాట్లింగ్ సంస్థను ఏర్పాటు చేయడంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఒకప్పుడు ఎంతో పేరున్న గోల్డ్ స్పాట్ శీతల పానీయాలను తయారు చేసే ఆయన్ను ప్రజలు 'గోల్డ్ స్పాట్ మూర్తి'గా ముద్దుగా పిలుచుకునేవారు. అనతికాలంలోనే ఈ వ్యాపారంలో రాణించిన ఆయన, గీతం యూనివర్శిటీని స్థాపించి వేలాది మందికి విద్యాదానం చేశారు.
మహిళల విద్యకు ఎంవీవీఎస్ మూర్తి విశేష కృషి చేశారు. అమలాపురంలో మహిళా జూనియర్ కళాశాలను, విశాఖలో అంబేద్కర్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో సీతారామ డిగ్రీ కాలేజీని స్థాపించారు. తన స్వగ్రామానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మూలపాలెంలో ఓ కాలేజీని ప్రారంభించారు.
1987 నుంచి 1989 వరకూ వుడా చైర్మన్ గా వున్న మూర్తి, నగరాభివృద్ధికి కృషి చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన వేళ, ఆయన వెంట నడిచారు. ప్రముఖ నేతగా గుర్తింపు తెచ్చుకుని 1991, 1999లో రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచి, ప్రజా సేవ చేశారు. అమెరికాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్త తెలుసుకున్న విశాఖ వాసులు, ఆయన్ను తలచుకుని కన్నీరు పెడుతున్నారు.