Kolkata: జైలు అధికారులు చూశారని మొబైల్ ఫోన్‌ను మింగేసిన ఖైదీ!
- ఫోన్లో మాట్లాడుతూ దొరికిన ఖైదీ
- తప్పించుకునేందుకు అమాంతం మింగేసిన వైనం
- ఆపరేషన్ చేయాలన్న వైద్యులు
జైలు అధికారులకు దొకకూడదనే ఉద్దేశంతో ఓ ఖైదీ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను మింగేశాడు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో జరిగిందీ ఘటన. దోపిడీలు, దొంగతనాల కేసులో ఏడాదిన్నరగా జైలులో ఉంటున్న రామచంద్ర వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్టు జైలు అధికారులకు సమాచారం అందింది.
దీంతో సోమవారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ మూల ఫోన్లో రామచంద్ర మాట్లాడుతున్నాడు. గమనించిన పోలీసులు అతడి వద్దకు వెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, తప్పించుకోవడం అసాధ్యమని భావించిన ఖైదీ సెల్‌ఫోన్‌ను మింగేశాడు. అనంతరం కడుపు నొప్పితో బాధపడుతుండడంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు.
విషయం తెలిసిన మంత్రి ఉజ్వల్ బిస్వాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను మింగగలడని తానెప్పుడూ ఊహించలేదని, నమ్మశక్యం కాకుండా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు. ఆసుపత్రిలో ఎక్స్‌రే తీసిన వైద్యులు రామచంద్ర పొట్టలో ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. బోవెల్ మూమెంట్ ద్వారా ఫోన్‌ను వెలికి తీసే ప్రయత్నం చేస్తామని, ఫలితం లేకుంటే సర్జరీ చేయక తప్పదని ఎంఆర్ బంగూర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.