Cricket: విశాఖలో మళ్లీ క్రికెట్ సందడి.. విండీస్‌తో రెండో వన్డే మ్యాచ్ కు అవకాశం!
- ఈనెల 24న ఇండోర్‌లో జరగాల్సిన మ్యాచ్ వేదిక మార్పు
- కాంప్లిమెంటరీ టికెట్ల రగడతో అవకాశాన్ని వదులుకోనున్న ఇండోర్
- ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ టూర్లో ఉన్న వెస్టిండిస్‌తో జరిగే రెండో వన్డేకు విశాఖ పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక అయ్యే అవకాశం ఉంది. విశాఖకు అనుకోని ఆతిథ్యంలా దక్కుతున్న ఈ అవకాశంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ టూర్లో ఉన్న వెస్టిండిస్‌తో ఆతిథ్య జట్టు రెండు టెస్ట్‌లు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఐదు వన్టే మ్యాచ్‌ల కోసం గువహటి, ఇండోర్, పుణె, ముంబయి, తిరువనంతపురంలను వేదికలుగా తొలుత నిర్ణయించారు. దీని ప్రకారం ఈనె 24వ తేదీన జరగాల్సిన రెండో వన్డేకు ఇండోర్ ఆతిథ్యం ఇవ్వాల్సిఉంది. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో 90 శాతం టికెట్లు అమ్మకానికి పెట్టాలి. 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాసులుగా ఇచ్చుకునే అవకాశం ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ఉంది.
అయితే అంతకంటే ఎక్కువ మొత్తం కాంప్లిమెంటరీ పాసులు కావాలని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ) డిమాండ్ చేస్తోంది. ఈ రగడ ఎంతకీ తెగకపోవడంతో ఆతిథ్య హక్కు వదులుకునేందుకు ఇండోర్ సిద్ధమైంది. ఈ వివాదం నేపథ్యంలో విశాఖకు రెండో వన్డే ఆతిథ్యం కట్టబెడితే నిర్వహించేందుకు సిద్ధమా? అని బోర్డుతోపాటు సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని కోరినట్లు సమాచారం. దీనికి ఏపీ క్రికెట్ సంఘం సంసిద్ధత తెలిపినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.