vijaydevarakonda: నేను ఆ సినిమా చేయడానికి ఆ నవలే కారణం: విజయ్ దేవరకొండ
- ఫ్రెండ్ ఇస్తే ఓ పుస్తకం చదివాను
- అది నాలో ఎంతో స్ఫూర్తిని కలిగించింది
- 'పెళ్లి చూపులు' చేయడానికి కారణమైంది
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, చాలా తక్కువ కాలంలోనే విజయ్ దేవరకొండ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన 'నోటా' చిత్రం .. ఈ నెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గతంలో తాను చేసిన 'పెళ్లి చూపులు' సినిమాను గురించి ప్రస్తావించాడు.
'పెళ్లి చూపులు' సినిమాను చేయాలనే స్ఫూర్తిని నాలో కలిగించినది 'రెబల్ వితౌట్ ఎ క్రూ' అనే నవల. ఈ నవలను ఒక ఫ్రండ్ ఇస్తే చదివాను. ఈ నవలలో నాయకుడు తాను అనుకున్నది సాధించడం కోసం తన కిడ్నీని సైతం అమ్ముకుంటాడు. ఎన్ని కష్టాలు పడైనా అనుకున్నది సాధించాలనే విషయం ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసింది. ఆ సమయంలోనే 'పెళ్లి చూపులు' కథ నా దగ్గరికి వచ్చింది. ఎవరమూ పారితోషికాలు తీసుకోకుండా .. బాధ్యతలను పంచుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాము. మా కష్టానికి సురేశ్ బాబు రూపంలో అదృష్టం తోడు కావడంతో, మా దశ తిరిగిపోయింది" అని చెప్పుకొచ్చాడు.