TRS: మేము ఎవరితో కలిస్తే మీకెందుకు బాధ?: టీఆర్ఎస్ కు షబ్బీర్ అలీ ప్రశ్న
- అధికారం కోసం మేం టీడీపీతో కలవలేదు
- దమ్ముంటే.. టీఆర్ఎస్ వంద సీట్లు గెలవాలి
- ఆంధ్రా కాంట్రాక్టర్లతో మిషన్ కాకతీయ నడపొచ్చా?
తెలంగాణలో టీడీపీ- కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ, రాజకీయాల్లో అన్ని అవకాశాలు ఉంటాయని, ఏదీ స్థిరంగా ఉండదని చెప్పారు. అధికారం కోసం తాము టీడీపీతో కలవలేదని, కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తుండటం వల్లే వారితో జత కలిశామని చెప్పారు.
‘ఇది మహాకూటమి కాదు మాయకూటమి’ అనే టీఆర్ఎస్ విమర్శలపై ఆయన సమాధానమిస్తూ.. ‘వంద సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు కదా! అంత దమ్ముంటే గెలవండి. మేము ఎవరితో కలిస్తే వాళ్లకెందుకు బాధ? ఆంధ్రా కాంట్రాక్టర్లతో మిషన్ కాకతీయ నడపొచ్చు! కమిషన్లు తీసుకోవచ్చు.. వాళ్లు ఏదైనా తీసుకోవచ్చు, కానీ, కాంగ్రెస్ వాళ్లు మాత్రం టీడీపీని కలిస్తే ఎందుకు కలుస్తున్నారని మాట్లాడుతున్నారు!’ అని విరుచుకుపడ్డారు.