Kerala: కేరళ వాసులకు మళ్లీ తుపాను హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ విభాగం
- కేరళలో మరోమారు కుమ్మేయనున్న వానలు
- అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
- హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి
వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కేరళకు మరోమారు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అరేబియా సముద్ర తీరం, శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళతోపాటు తమిళనాడులోనూ కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ ఆదివారం వర్షాలు కురువనున్నాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో మూడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. జాతీయ విపత్తు దళాన్నిఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారులు ఐదో తేదీలోపు తీరానికి చేరుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు పర్యాటకులు రాకపోవడమే మంచిదని ముఖ్యమంత్రి సూచించారు.
కాగా, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి ఈ నెల 8వ తేదీకల్లా అల్ప పీడనంగా మారుతుంది. అనంతరం అది బలపడి భారీ తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.