MVVS Murthy: ఎంవీవీఎస్ మూర్తి మృతదేహం రాక మరింత ఆలస్యం!
- మరో మూడు రోజులు పట్టే అవకాశం
- మృతదేహాలు పాడుకాకుండా ఎంబామింగ్
- ఆదివారం నాటికి విశాఖకు మూర్తి మృతదేహం
అమెరికాలోని అలస్కాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన గీతం విద్యా సంస్థల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతదేహం రాక ఆలస్యం కానుంది. ఆయన, ఆయనతో పాటు మరణించిన మరో ముగ్గురి మృతదేహాలను మూడు రోజుల తరువాతే అమెరికా నుంచి తరలిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం నలుగురి మృతదేహాలను ఆంకరేజ్ నగరంలోని ఫ్యనరల్ హోమ్ సిటీకి తరలించి భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. మృతదేహాలు పాడుకాకుండా రసాయన లేపనం చేయనున్నామని వైద్యాధికారులు తెలిపారు. రసాయన లేపనాల ప్రక్రియ ఎంబామింగ్ పూర్తయిన తరువాత భౌతికకాయాలను భారత్ కు తరలించే ఏర్పాట్లు జరుగుతాయని తానా ప్రతినిధులు పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం అన్ని అనుమతులు తీసుకుని, ఆదివారం నాటికి మృతదేహాలను ఇండియాకు చేర్చేందుకు ప్రయత్నిస్తామని వారు అన్నారు. కాగా, ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు ఆయన మనవడు యూఎస్ వెళ్లారు.