Cheating: కష్టాలు తీర్చమని వెళితే రూ.25 లక్షలకు ముంబై మంత్రగాళ్ల టోకరా!

  • బాధితుడి పొలంలో గుప్త నిధుల కోసం పూజలు పేరుతో మోసం
  • తవ్వకాల్లో రెండు రాగి బిందెలు, బ్యాగు వెలికితీసి నాటకం
  • ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ప్రత్యేక పూజలు చేస్తే గుప్త నిధులు దక్కుతాయని ఆశపడ్డ రైతు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మరింత కష్టాలపాలయ్యాడు. ముంబై మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. రూ.25 లక్షలు వారికి విడతల వారీగా చెల్లించి నష్టపోయాడు. చివరికి మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు అంబేడ్కర్‌ కాలనీకి చెందిన పిట్టల శ్రవణ్‌కుమార్‌ సమస్యలతో సతమతమవుతున్నాడు. వాటి నుంచి బయటపడే మార్గం చూపాలంటూ మూడు నెలల క్రితం ముంబైకి చెందిన మంత్రగాళ్లను ఆశ్రయించాడు. ‘నీ స్వగ్రామం పుల్కల్ మండలం దేవుని అంగడిలోని పొలంలో గుప్తనిధున్నాయి. అక్కడ పూజలు చేస్తే నిధులు నీ సొంతం అవుతాయి’ అని చెప్పారు.  

దీన్ని శ్రవణ్‌ విశ్వసించడంతో అతని పొలంలో పూజలు నిర్వహించినట్లు నటించారు. కాసేపటి తర్వాత అక్కడ తవ్వకాలు జరిపి రెండు రాగి బిందెలు, ఓ బ్యాగు వెలికి తీశారు. అనుకున్నట్లే అంతా జరగడంతో శ్రవణ్‌ గుప్తనిధులు బయటపడ్డాయని సంబరపడ్డాడు. బిందెల్లో బంగారం, వజ్రాలు, బ్యాగులో నగదు ఉన్నాయని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే వాటిని తెరిచి స్వాధీనం చేసుకోవాలని శ్రవణ్‌ని మోసగాళ్లు నమ్మించారు.

అంతా మంత్రగాళ్లు చెబుతున్నట్లే జరుగుతోందన్న భ్రమలో ఉన్న శ్రవణ్‌ పూజల కోసం వారు చెప్పినట్లే విడతల వారీగా వారి అకౌంట్లలో 25 లక్షలు జమ చేశాడు. ఆ తర్వాత బిందెలు, బ్యాగు తెరిచి చూస్తే రాళ్లు, చిత్తుకాగితాలు కనిపించాయి. దీంతో షాక్‌ తిన్న శ్రవణ్‌ మంత్రగాళ్లకు ఫోన్‌ చేయగా వారు స్పందించలేదు. తాను మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు పూజలు చేసేందుకు మరోసారి నగదు కావాలంటూ బుధవారం వచ్చిన నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మోసానికి పాల్పడిన మహ్మద్‌ షాబాజ్‌ (28), కుమీర్‌ (48), ఇక్బాల్‌ (45)ను అరెస్టు చేయగా సలీం, అశ్వాక్‌లు పరారీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News