Nalgonda District: వేనేపల్లి బహిష్కరణ ఎఫెక్ట్.. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్కు రాజీనామాల షాక్!
- నాంపల్లి ఎంపీపీ, మరో ముగ్గురు ఎంపీటీసీలు పార్టీకి గుడ్ బై
- వీరితోపాటు మరికొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా
- వెంకటేశ్వరరావు బహిష్కరణను తప్పుపట్టిన నాయకులు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్కు రాజీనామాల షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వరరావుపై అధిష్ఠానం బహిష్కరణ వేటు వేయడాన్ని తప్పుపడుతూ పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి రాంరాం చెప్పారు. తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన నాలుగేళ్ల పాలనలో సొంత పార్టీ నాయకులనే అనేక ఇబ్బందులకు గురిచేశారని, అటువంటి వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పిన వేనేపల్లిపై అధిష్ఠానం బహిష్కరణ వేటు వేయడం దారుణమని వీరు వ్యాఖ్యానించారు.
పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ తాము రాజీనామా చేస్తున్నట్లు నాంపల్లి ఎంపీపీ దండిగ నాగమణితోపాటు చిన్నపాడు, దేవత్‌పల్లి, లింగోటం ఎంపీటీసీ సభ్యులు కళమ్మ సత్యనారాయణ, మాధవి యాదగిరి, శ్రీనివాస్‌లు ప్రకటించారు. వీరితోపాటు సింగిల్ విండో డైరెక్టర్లు కామిశెట్టి బాలయ్య, అంగిరేకు పాండు, యాదయ్య, జిల్లా నాయకులు చిరుమామిళ్ల గిరిబాబు, మాజీ సర్పంచ్‌లు వెంకటయ్య, శ్రీనివాసాచారి, పగిళ్ల కల్పన యాదగిరి, మరికొందరు నాయకులు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.