team india: తొలి టెస్టు తొలి రోజు మనదే.. భారీ స్కోరు దిశగా టీమిండియా!

  • నాలుగు వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసిన టీమిండియా
  • 134 పరుగులు చేసిన పృథ్వీ షా
  • అర్థశతకాన్ని పూర్తి చేసిన కోహ్లీ

రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ లోనే భారత్ కు షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో, మరో ఓపెనర్ పృథ్వీ షాతో కలిసి చటేశ్వర్ పుజారా స్కోరు బోర్డులు ముందుకు తీసుకెళ్లాడు.

కెరియర్ లో తొలి టెస్టు ఆడుతున్న పృథ్వీ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే స్టైల్లో ఆడుతూ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. 99 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తం మీద 154 బంతుల్లో 134 పరుగులు (19 ఫోర్లు) చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు పుజారా 130 బంతుల్లో 86 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ కలసి 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

షా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే (41) నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ కోహ్లీ సమయోచితంగా ఆడుతూ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ (72), రిషబ్ పంత్ (17) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్, లూయిస్, బిషూ, ఛేస్ లు చెరో వికెట్ తీశారు. 

  • Loading...

More Telugu News