kcr: నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో!: చంద్రబాబుకు కేసీఆర్ వార్నింగ్
- ఏపీలో చంద్రబాబు కథ చక్కగా లేదు
- తెలంగాణకు మళ్లీ నువ్వు కావాలా?
- ఎన్నో పోరాటాలు చేసి పీడ వదిలించుకున్నాం
ఏపీలో చంద్రబాబు కథ చక్కగా లేదని, గందరగోళంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఇవాళ ఇక్కడ (తెలంగాణ) దుకాణం పెడదామనుకుంటున్నావు.. బిడ్డా! నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. తెలంగాణకు మళ్లీ నువ్వు కావాలా? తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ నాయకులు పోతున్నారు!
చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న తెలంగాణను మళ్లీ తీసుకుపోయి విజయవాడకు అప్పజెబుతారా? రేపు దరఖాస్తులు పట్టుకుని మనం అమరావతి పోవాలా? హైదరాబాద్ పోవాలా? యాభై ఎనిమిదేళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి వదిలించుకుంటే..ఈరోజున ఈ దుర్మార్గులు నిస్సిగ్గుగా, పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఒక్కసారి ఊహించండి.. ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి.. చంద్రబాబు పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిస్తే.. మనకు సాగర్ నీళ్లు రానిస్తాడా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తాడా?’ అని ప్రశ్నించారు.