gadwal: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబమే బాగుపడింది
- నాలుగేళ్ల దుర్మార్గపు పాలనకు అంతం పలుకుతాం
- మోసకారి మోదీకి కేసీఆర్ ఏజెంట్
ఈ దరిద్రపు కేసీఆర్ పరిపాలనలో ఆయన కుటుంబం ఒక్కటే బాగుపడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్వాల్ లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో ఆ కుటుంబంలోని నలుగురే బాగుపడ్డారని, మనందరికి ఎటువంటి మేలు జరగలేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని, నాలుగేళ్ల దుర్మార్గపు పాలనకు తమ పార్టీ అంతం పలుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తన కర్మ కొద్దీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి టీఆర్ఎస్ పాలనకు ఆయనే చరమగీతం పాడుకోనున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, ముస్లింలు, నిరుద్యోగులకు మేలు జరగాలని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు.
మోసకారి మోదీకి కేసీఆర్ ఏజెంట్ అని, నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో మోదీని కేసీఆర్ సమర్థించలేదా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాశారని, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టడం కోసం ప్రజలంతా ఏకం కావాలని పిలుపు నిచ్చారు. మహాకూటమిని చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.