Andhra Pradesh: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 21 లోక్ సభ సీట్లు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి
- సెప్టెంబరులో సర్వే చేసిన సీ ఓటర్
- టీడీపీకి నాలుగు సీట్లు మాత్రమే
- ఓట్ల శాతంలోనూ వైసీపీదే పైచేయి
ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు, టీడీపీకి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఓ జాతీయ న్యూస్ చానల్లో ప్రసారమయ్యాయి. సెప్టెంబరు నెలలో ఈ సర్వే నిర్వహించింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎటువంటి పొత్తులు లేకుండా పోటీ పడితే వైసీపీకి 21 లోక్‌సభ స్థానాలు వస్తాయని, బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక్క సీటు కూడా రాదని సర్వే పేర్కొంది.
ఓట్ల విషయంలో వైసీపీకి 41.9 శాతం, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయని సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పట్లో టీడీపీకి 15, బీజేపీకి రెండు సీట్లు రాగా, వైసీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. వైసీపీకి 21 సీట్లు వస్తాయన్న తాజా సర్వే ఫలితాలతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.