India: పసలేని విండీస్ బౌలింగ్... 500 దాటిన ఇండియా స్కోరు!
- ఏమాత్రం ప్రభావం చూపని విండీస్ బౌలర్లు
- తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్
- భారీ స్కోరు దిశగా టీమిండియా
వెస్టిండీస్ ఆటగాళ్ల బౌలింగ్ అత్యంత పేలవంగా సాగుతూ ఉండటంతో భారత స్కోరు 500 పరుగులను దాటింది. రాజ్ కోట్ లో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నేడు రెండో రోజు ఆట సాగుతుండగా, కొత్త బంతిని తీసుకున్న తరువాత కూడా విండీస్ బౌలర్లు భారత వికెట్లను కూల్చడంలో విఫలం అవుతున్నారు.
ఈ ఉదయం ఒక్క రిషబ్ పంత్ వికెట్ మాత్రమే వారికి దక్కింది. 84 బంతుల్లో 92 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఛేజ్ బౌలింగ్ లో డవ్రిక్ కు క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అప్పటికే సెంచరీ దాటేసిన కోహ్లీ, జడేజా భాగస్వామిగా స్కోరును ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 117 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 502 పరుగులు.
భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) మినహా మిగతా అంతా రాణించారు. పృథ్వీ షా 135, పుజారా 86, రహానే 41 పరుగులు చేసి అవుట్ కాగా, జడేజా 16 పరుగులతో నాటౌట్ గా కొనసాగుతున్నాడు. నేటి మధ్యాహ్నం లంచ్ తరువాత భారత్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి.