Telugudesam: ఐటీ దాడులపై తెలుగుదేశం ఆరోపణలు అవాస్తవం: జీవీఎల్ నరసింహరావు
- ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలుండవు
- రాజకీయ కక్ష అనడం టీడీపీ నేతల అజ్ఞానం
- అవినీతిలో కూరుకుపోయిన పార్టీ తెలుగుదేశం
- బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు
ఏపీలో ఐటీ అధికారులు జరుపుతున్న సోదాలపై తెలుగదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై కక్ష సాధింపు చర్యలు ఉండబోవని, ఇదే సమయంలో తప్పు చేస్తే ఎటువంటివారికైనా శిక్ష తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, దాడుల వెనుక బీజేపీ ప్రమేయం ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు. రాజకీయ కక్షతో ఐటీ దాడులు జరుగుతున్నాయని అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకే టీడీపీ నేతలు ఇటువంటి నిందలు వేస్తున్నారని, ఓ స్వతంత్ర సంస్థ జరిపే దాడులకు తమ పార్టీ ఎలా బాధ్యత వహిస్తుందని ఆయన ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ, ఇప్పుడు బీజేపీని కూడా అదే రొంపిలోకి దింపాలని తనవంతు ప్రయత్నాలు చేస్తోందని జీవీఎల్ విమర్శించారు.