Chandrababu: కేసీఆర్ ఎంత తిడితే అంతమంచిది.. ఆయనను యథేచ్ఛగా తిట్టుకోనివ్వండి: టీడీపీ
- కేసీఆర్ తిట్లపై ఏపీ కేబినెట్‌లో ప్రస్తావన
- కేసీఆర్ తిట్లు మన మంచికే అన్న మంత్రులు
- ఏపీ, తెలంగాణలో సానుభూతి పెరుగుతోందని అభిప్రాయం
ప్రజా ఆశీర్వాద సభల్లో ఏపీ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడిపై టీఆర్ఎస్ అధినేత తీవ్రస్థాయిలో దూషిస్తుండడంపై ఏపీ కేబినెట్‌లో వాడీవేడి చర్చ జరిగింది. శుక్రవారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు జరిగిన కేబినెట్ మీట్‌లో కేసీఆర్ తిట్ల విషయం చర్చకు వచ్చింది. కేసీఆర్ ప్రతీ సభలోనూ చంద్రబాబుపై విరుచుకుపడుతున్న విషయాన్ని మంత్రులు ప్రస్తావించారు.
కొందరు మంత్రులు ఈ విషయంపై మాట్లాడుతూ.. కేసీఆర్ ఎంతగా నోరు పారేసుకుంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తీరును తెలుగు ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల అటు తెలంగాణతోపాటు ఇటు ఏపీలో ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతి వ్యక్తమవుతోందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
అందుకే ఆయనను యథేచ్ఛగా తిట్టుకోనివ్వాలని పేర్కొన్నారు. ఆయన తిట్ల దండకం వల్ల అంతా మంచే జరుగుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. ఇటీవల వరుసగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.