Tirupati: తిరుపతిలో విశ్రాంత న్యాయమూర్తి ఆత్మహత్య.. విషయం తెలిసి రైలుకింద పడ్డ భార్య!
- రిటైరైన తరువాత ఆర్బిట్రేటర్ గా పనిచేస్తున్న సుధాకర్
- అనారోగ్యంతో రైలుకింద పడి ఆత్మహత్య
- గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో భార్య కూడా ఆత్మహత్య
పదవీ విరమణ చేసి ఆర్బిట్రేటర్ గా పనిచేస్తున్న జడ్జి, ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలియగానే, ఆయన భార్య మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం, పామూరు సుధాకర్ (63) తన భార్య వరలక్ష్మి (56)తో కలసి తిరుచానూరులో ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు గత కొంతకాలంగా కాళ్లు, కీళ్ల నొప్పులతో అనారోగ్యం బారిన పడ్డ సుధాకర్, మనోవేదనతో కలత చెంది, తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ సూసైడ్ నోట్ రాసి, నిన్న ఉదయం ఇల్లు వదిలి వెళాడు. ఆపై ఆయన మృతదేహం రైల్వే ట్రాక్ పై కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అతన్ని గుర్తించి ఆయన కుమారుడు సందీప్ కు సమాచారం ఇచ్చారు.
వరలక్ష్మికి విషయం తెలియగానే కన్నీరు మున్నీరుగా విలపించింది. సాయంత్రం పూట, ఇంట్లో ఉన్నవాళ్ల దృష్టిని మళ్లించి, భర్త ఆత్మహత్యకు పాల్పడిన చోటికే వచ్చి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను సుధాకర్ భార్యగా గుర్తించిన పోలీసులు, రెండు మృతదేహాలనూ పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. మరణంలోనూ భర్త అడుగుజాడల్లోనే వరలక్ష్మి నడిచిందంటూ చుట్టుపక్కల వారు కన్నీరు పెట్టుకున్నారు.