paruchuri: మా అన్నయ్యకి చెప్పుకుని శ్రీకాంత్ అడ్డాల బాధపడ్డారట: పరుచూరి గోపాలకృష్ణ
- మహేశ్ తో సినిమా అంటే మాటలా
- ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి
- హడావిడి పడితే సినిమా దెబ్బతింటుంది
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన 'బ్రహ్మోత్సవం' సినిమాను గురించి ఈ వారం 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "ఈ సినిమాకి తొమ్మిదిమంది రచయితలు పనిచేశారు. ఒక్కొక్కళ్ల భావన ఒక్కోరకంగా వుంటుంది. ఇంతమంది అయ్యేసరికి ఒకరేం రాశారనేది ఇంకొకరికి తెలియదు. అలాంటప్పుడు చెప్పదలచుకున్న విషయం కనెక్ట్ కావడం చాలా కష్టం.
ఒక రోజున శ్రీకాంత్ అడ్డాల మా అన్నయ్య దగ్గరికి వచ్చి 'గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాను .. చాలా బాధగా వుంది' అని ఫీలయ్యారట. ఆయనలా బాధపడటంలో అర్థం వుంది. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం రావడమనేది ఒక వరం. అలాంటి వరం దొరికినప్పుడు హడావిడిగా పరిగెత్తుకెళ్లి సినిమా తీయకుండా, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కో హీరో ఒక్కో సినిమా కోసం ఒకటి .. రెండేళ్లు సమయం తీసుకుంటున్నప్పుడు, ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సినిమా దెబ్బతింటుందనడానికి ఇదే ఉదాహరణ" అని ఆయన చెప్పుకొచ్చారు.