jc diwakar reddy: సహచరులపై ఐటీ దాడులతో చంద్రబాబు బాధపడుతున్నారు!: జేసీ దివాకర్ రెడ్డి
- అందరూ చల్లాగా ఉండాలని బాబు కోరుకుంటారు
- తాను మాత్రమే హాయిగా ఉండాలని మోదీ అనుకుంటారు
- వీటి మధ్య సంఘర్షణే తాజా ఐటీ దాడులు
నేను బతకాలి.. నాతో పాటు ఇంకో పదిమంది కూడా చల్లగా బతకాలన్నది చంద్రబాబు మనస్తత్వమని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నేను మాత్రమే బతకాలి, ఇంకెవరూ బతకడానికి వీలులేదు అనేది ప్రధాని మోదీ ఆలోచనా విధానమని ఆయన విమర్శించారు. ఈ రోజు చంద్రబాబును అమరావతిలో కలుసుకున్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వ్యాపారస్తులపై చేయిస్తున్న ఐటీ దాడులకు తాము భయపడటం లేదని జేసీ స్పష్టం చేశారు. అసలు తామెందుకు భయపడాలని ప్రశ్నించారు.
తన సహచరుల మీద ఐటీ దాడులు జరగడంపై చంద్రబాబు బాధపడుతున్నారని జేసీ అన్నారు. మోదీ లాంటి వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవద్దని తాను చంద్రబాబుకు ముందుగానే సూచించానని వెల్లడించారు. కేసీఆర్ ఎన్నికల సభల్లో ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని జేసీ ఎద్దేవా చేశారు. ఎంత పాత స్నేహితుడైనా అలాంటి భాష వాడటం తగదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎంత దుర్భాషలాడినా చంద్రబాబు హుందాగా స్పందించారనీ, వారిద్దరికీ తేడా అదేనని జేసీ అన్నారు.
కేసీఆర్ మూడో కన్ను తెరిస్తే.. భస్మాసురుడిలా ఆయనే కాలిపోతారని జేసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు మూడో కన్ను లేదనీ, కాబట్టి తాను దాన్ని తెరిచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలోని చిన్న పొలమడ లో ఉన్న ప్రబోధానంద స్వామి ఓ క్రిమినల్ అని జేసీ ఆరోపించారు. ఒకరు ప్రాణాలు కోల్పోయి, 40 మంది గాయలపాలైనా ఆయనపై చర్యలు తీసుకోలేకపోయారని దుయ్యబట్టారు. ఈ విషయంపై తాను మాట్లాడదలుచుకోలేదని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.