KCR: అమావాస్య రోజున పోలింగ్ కేసీఆర్‌కు కలిసొస్తుందా?.. ఎన్నికల తేదీలపై రసవత్తర చర్చ!
- డిసెంబర్ 7న అమావాస్య
- ఏమాత్రం కలిసిరాదంటున్న మధుయాష్కీ
- సామాజిక మాధ్యమాల్లో రసవత్తర చర్చ
- డిసెంబర్ 11 కూడా అనుకూలంగా లేదట
నిన్నటి వరకూ తెలంగాణలో హాట్ టాపిక్ ముందస్తు టీఆర్ఎస్కు కలిసొస్తుందా? లేదా? అని జరిగింది. నేడు ఎన్నికల నగారా మోగింది. షెడ్యుల్ ప్రకారం డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 11న తుది ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త చర్చకు తెర లేచింది. అసలే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంట్స్ ఎక్కువ. పోలింగ్ తేదీ వచ్చేసి డిసెంబర్ 7న అంటే ఆరోజు అమావాస్య. మరి అమావాస్య రోజున జరగబోయే పోలింగ్ టీఆర్ఎస్కు కలిసొస్తుందా? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది సామాజిక మాధ్యమాల్లో రసవత్తరంగా నడుస్తున్న చర్చ.
కేసీఆర్ చాలా కాలిక్యులేటెడ్‌గా అసెంబ్లీని రద్దు చేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ 6నే అంటే నిర్ణీత కాలపరిమితి కంటే 8 నెలల 26 రోజుల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. అత్యంత బలమైన గురుపుష్య యోగం.. అమృతసిద్ధి యోగం.. కేసీఆర్ అదృష్ట సంఖ్య 6.. ఇలా అన్నివిధాలా ఆలోచించాకే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా ఆయన సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు.
కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 కలసి వచ్చేలా టీఆర్ఎస్ పార్టీ 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్టు సంఖ్యాశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు షెడ్యూల్ ప్రకటించిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ మొట్ట మొదట తేదీలపై స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ ఏమాత్రం కేసీఆర్‌కు కలిసిరాదని జోస్యం చెప్పనే చెప్పారు. అలాగే ఫలితాల వెల్లడి తేదీ డిసెంబర్ 11 కూడా అనుకూలంగా లేదని కొందరు నెటిజన్ల వాదన. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మొత్తానికి పోలింగ్ తేది అమావాస్య రోజున వచ్చి పెద్ద చర్చకు తెరలేపిందనే చెప్పాలి.