kcr: ఆ రెండూ కేసీఆర్ ని వెంటాడుతున్నాయి: కోదండరామ్
- వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుందోననే భయం
- అధికారం లేకుండా బతకడమెలా అనే భావన
- ఈ రెండూ కేసీఆర్ ని వెంటాడుతున్నాయి
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుందోననే భయం, అధికారం లేకుండా బతకడమెలా అనే భావన.. ఈ రెండూ సీఎం కేసీఆర్ ని వెంటాడుతున్నాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ముఖ్యమంత్రిని నన్ను అంటారా?’ అని సీఎం కేసీఆర్ పదేపదే అంటున్నారని, ఆయన పెద్ద మనిషి తరహాగా మాట్లాడితే చాలా బాగుండేదని హితవు పలికారు.
ఇచ్చిన మాటను మరిచి, అధికారం మళ్లీ కావాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రికి, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఐక్యంగా ఒక ప్రయత్నం చేయాలన్న ఒక మార్గానికి మధ్య ఈరోజు ఘర్షణ జరుగుతోందని ఆయన అన్నారు. కచ్చితంగా, అందరం కలిసి పొత్తులు పెట్టుకుంటామని, ఉమ్మడి అలయెన్స్ తప్పకుండా తెలంగాణలో ఉంటుందని స్పష్టం చేస్తున్నానని అన్నారు. పార్టీకి నష్టం జరగకుండా పొత్తులు ఉంటాయని, అన్ని సమస్యలు పరిష్కరించుకుని సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు.