Bandla Ganesh: తెలంగాణ ప్రజల కళ్లల్లో ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి: బండ్ల గణేష్
- పెరిగింది తెలంగాణలోనే.. నా కర్మ కూడా ఇక్కడే
- డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు
- సినిమాలు తీయడం మానను
- నెహ్రూ కుటుంబమంటే అదో రకమైన బంధం
తాను పుట్టింది ఆంధ్రాలో అయినప్పటికీ పెరిగిందంతా తెలంగాణలోనేనని.. కర్మ కూడా తెలంగాణలోనేనని సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయన ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘రాజకీయ నేతగా సేవ చేస్తా.. నిర్మాతగా సినిమాలు తీస్తా. డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి వచ్చానని సినిమాలు తీయడం మానను. నేను బతకాలన్నా.. నా భార్యాపిల్లల్ని పోషించుకోవాలన్నా సినిమాలు తీయాలి. నేను పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది తెలంగాణలో.. నా కర్మ కూడా తెలంగాణలోనే.
ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చా. తెలంగాణ ప్రజల కళ్లల్లో ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. రగులుతున్న వాళ్ల గుండె చప్పుడు, మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న వాళ్ల ఆవేదన కనిపిస్తోంది. ఓటు ద్వారా వాళ్లు చెప్పబోయే తీర్పు ముందే అర్థమైపోతోంది. వాళ్ల నమ్మకమే నిజంకాబోతోంది. కాంగ్రెస్ అంటే ప్రేమ. సోనియా అంటే గౌరవం. ఇందిరాగాంధీ అంటే అభిమానం. నెహ్రూ కుటుంబమంటే అదో రకమైన బంధం’’ అన్నారు.