raghavendra rao: రామారావుగారు అడవిలో 40 రోజులు వుండటం అదే ఫస్టు టైమ్: రాఘవేంద్రరావు
- 'పాండవ వనవాసం' సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్
- 'అడవిరాముడు' సినిమాకి దర్శకత్వం వహించాను
- ఎన్టీఆర్ అవకాశమివ్వడం గొప్ప విషయం
దర్శకుడిగా రాఘవేంద్రరావు సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దర్శకేంద్రుడు అనిపించుకున్న ఆయన, తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో ఎన్టీఆర్ తో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావించారు.
"ఈ రోజున నేను ఈ స్థానంలో ఉండటానికి ప్రధానమైన కారణం ఎన్టీ రామారావుగారు. 'అడవిరాముడు' సినిమాతో నాకు మంచి బ్రేక్ ను ఇచ్చారు. 'పాండవ వనవాసం' సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా నా కెరియర్ మొదలైంది. ఆ సినిమాకి నేను రామారావుగారిపై క్లాప్ కొట్టాను. దర్శకుడిగా మారాక నేను చేసిన రెండు సినిమాలు యావరేజ్ గా ఆడాయి. అయినా నిర్మాతలు చెప్పగానే 'ఆ బ్రదర్ చాలా బాగా చేస్తారు .. నాకు నమ్మకం వుంది' అన్నారట ఎన్టీ రామారావు.
అలా ఆయన అవకాశం ఇవ్వడం అప్పట్లో నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. 'అడవిరాముడు' సినిమా కోసం ఆయన 40 రోజుల పాటు అడవిలో వున్నారు. ఆయన అలా వుండటం ఫస్టుటైమ్. చివరి వరకూ ఆయన నన్ను ఎంతో అభిమానంగా చూసుకున్నారు. తన రాజకీయ జీవితానికి నేను .. దాసరిగారు చేసిన సినిమాలు ఎంతో దోహదపడ్డాయని అంటుండేవారు" అని చెప్పుకొచ్చారు.