BJP: బీజేపీ నాయకురాలు ఉప్పల శారదపై ఫోర్జరీ కేసు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ డి.విఠల్రావు కుమార్తె విజయ
- లీజుకిచ్చిన తమ స్థలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు
- అడిగితే బెదిరిస్తున్నట్లు ఆరోపణ
తెలంగాణ బీజేపీ నాయకురాలు ఉప్పల శారదపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. లీజుకిచ్చిన తమ స్థలం కాజేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు మాజీ ఎంపీ డి.విఠల్రావు కుమార్తె దేవరకొండ విజయ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శారదపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే...సీనియర్ కాంగ్రెస్ నేత, మహబూబ్నగర్ మాజీ ఎంపీ డి.విఠల్రావుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు-5లో అన్నపూర్ణా స్డూడియోస్ ఎదురుగా ఇల్లుంది. ఈ ఇంటిని శారద కొన్నాళ్ల క్రితం లీజుకు తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ స్థలంలోని నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. తమ స్థలంలో తమ అనుమతి లేకుండా కూల్చివేతలేమిటని విజయ ప్రశ్నించారు. దీంతో శారద స్థలం తమదంటూ డాక్యుమెంట్లు చూపించడంతో అవాక్కయ్యారు.
దీనిపై విజయ తన ఫిర్యాదులో వివరిస్తూ, ‘ఆమె మా స్థలం కాజేసేందుకు ఎత్తుగడ వేశారని అర్థమయింది. ఇందుకోసం మా నాన్నది, నా సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇదేమిటని అడిగితే కోర్టులో మీరు కేసు వేస్తే ఏళ్లు పడుతుంది, స్థలాన్ని మాత్రం మీకు దక్కనీయకుండా చేస్తా’ అంటూ బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. సంతకాలను ఫోరెన్సిక్ నిపుణులతో తనిఖీ చేయించాలని ఆమె కోరారు.