Uttam Kumar Reddy: కాంగ్రెస్- టీడీపీ పొత్తుపై ఉత్తమ్ కు 12 ప్రశ్నలు సంధించిన హరీశ్ రావు
- ‘పోలవరం’పై కాంగ్రెస్, చంద్రబాబు వైఖరులేంటి?
- 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతారా?
- ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే అభ్యంతరం లేదని బాబు చెప్పగలరా?: హరీశ్ రావు
తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై సమాధానం చెప్పాలంటూ టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఉత్తమ్ కు 12 ప్రశ్నలు సంధించారు. అవి ఇవిగో..
- తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?
- పోలవరం 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందా?
- సీలేరు ప్రాజెక్టు వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా? ఈ ప్రాజెక్ట్ కు బదులుగా తెలంగాణకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చేందుకు బాబుతో ఒప్పందం చేసుకున్నారా?
- హైకోర్టు సత్వర విభజన సహా, ప్రభుత్వ సంస్థల విభజనలో స్తంభన తొలగించడానికి చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా?
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటా కేటాయించడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా?
- తెలుగు జాతి’ అని మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వడానికి తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారి.. మరి అది తప్పేనని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారా?
- విద్యుత్ శాఖలో 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తగ్గిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులను ఉపసంహరింపజేస్తారా?
- నిజాం హయాం నాటి ఆస్తులు తెలంగాణకే తప్ప, ఏపీకి ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? ఈ విషయమై కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని బాబుతో ఒప్పందం ఏమైనా చేసుకున్నారా?
- పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం రామాలయం సహా, తెలంగాణలో లక్ష ఎకరాలు నీట మునుగుతాయి. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? ‘పోలవరం’పై కాంగ్రెస్, చంద్రబాబు వైఖరులేంటి? తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయగలరా?
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించేందుకు తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? ‘పాలమూరు- రంగారెడ్డి’పై చంద్రబాబు వైఖరేంటి? చంద్రబాబు వైఖరి చెప్పకుండా పొత్తుపెట్టుకుంటే అది తెలంగాణ ప్రజలకు విఘాతం కాదా?
- కాళేశ్వరం, తమ్మిడిహట్టి, సీతారామ, తుపాకుల గూడెం, దేవాదుల, పెన్ గంగ, రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు వాటిని వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా?
- ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తానని చంద్రబాబు ఒప్పుకున్నారా?