Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. తలలు పట్టుకున్న మోదీ, అమిత్ షా!
- అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చామన్న గడ్కరీ
- పార్టీలో కలకలం రేపిన వ్యాఖ్యలు
- అస్త్రంగా వాడుకుంటున్న కాంగ్రెస్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చామని పేర్కొన్నారు. తామిచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ప్రయత్నం కూడా జరగలేదని కుండ బద్దలుగొట్టారు. గడ్కరీ వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తలలు పట్టుకున్నారు. మరోవైపు, గడ్కరీ వ్యాఖ్యలను అస్త్రంగా మార్చుకున్న కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడుతోంది.
తాము అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఎవరికీ లేదని, అందుకనే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వాలని తమకు సలహా ఇచ్చారని ‘కలర్స్ చానల్’లో నిర్వహించిన రియాలిటీ షో ‘అసల్ పవానే- ఇర్సల్ నమూనే’లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌తో కలిసి గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో తామిచ్చిన హామీలను ప్రజలు గుర్తు చేస్తుంటే నవ్వి వెళ్లిపోతున్నామని గడ్కరీ పేర్కొన్నారు. అధికారంలోకి రాకపోయి ఉంటే ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవాల్సి వచ్చేది కాదని, కానీ అధికారంలోకి రావడంతో పెద్ద సమస్య వచ్చిపడిందని మనసులోని మాటను బయటపెట్టేశారు. పారదర్శకంగా ఉండే పార్టీ అవసరం ఎంతో ఉందని గడ్కరీ పేర్కొన్నారు.
గడ్కరీ వ్యాఖ్యలను తమకు దొరికిన అస్త్రంగా కాంగ్రెస్ ఉయోగించుకుంటోంది. అధికారంలోకి రావడం కోసం ప్రజల నమ్మకాన్ని బీజేపీ వాడుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గడ్కరీ చేసిన వ్యాఖ్యల క్లిప్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. మొత్తానికి గడ్కరీ నిజం చెప్పారని, వంచన, అబద్ధపు హామీలతోనే మోదీ ప్రభుత్వం ఏర్పడిందన్న తమ అభిప్రాయంతో గడ్కరీ ఏకీభవించారని ఆయన పేర్కొన్నారు.