Elections: తెలంగాణలో టీఆర్ఎస్సే... 2 బీజేపీ రాష్ట్రాలు కాంగ్రెస్ వే: సీ–వోటర్, టైమ్స్ నౌ, ఐటీటెక్ గ్రూప్ సర్వేల విశ్లేషణ
- మధ్యప్రదేశ్ లో మాత్రమే మరోసారి బీజేపీకి చాన్స్
- రాజస్థాన్, చత్తీస్ గఢ్ కాంగ్రెస్ వే
- తెలంగాణలో 18 సీట్లకు పరిమితం కానున్న కాంగ్రెస్
తెలంగాణలో డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి విజయం సాధించి, అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. సీ–వోటర్, టైమ్స్ నౌ, ఐటీటెక్ గ్రూప్ తదితర సంస్థలు, ఇప్పటికే సర్వేలను నిర్వహించగా, వాటి ఆధారంగా ఓ రిపోర్టు తయారైంది. మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనుండగా, వాటిల్లో మూడింట బీజేపీ అధికారంలో ఉంది. వాటిల్లో రెండు కాంగ్రెస్ చేతికి రానున్నాయన్నది ఈ సర్వేల సారాంశం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంటున్నాయి.
తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, ద టీమ్ ఫ్లాష్, వీడీయే అసోసియేట్స్ సంస్థల సర్వేల తరువాత, టీఆర్ఎస్ కు 85, కాంగ్రెస్ కు 18, ఎంఐఎం కు 7, బీజేపీకి 5, ఇతరులు 4 సీట్లలో గెలుస్తారని అంచనా.
మధ్యప్రదేశ్ లో 230 స్థానాలుండగా, సీ–వోటర్, టైమ్స్ నౌ, ఐటీటెక్ గ్రూప్ సర్వే వివరాల ప్రకారం, బీజేపీకి 126, కాంగ్రెస్ కు 97, ఇతరులకు 7 సీట్లు దక్కే చాన్స్ ఉంది. రాజస్థాన్ లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, కాంగ్రెస్ కు 129, బీజేపీకి 63, ఇతరులకు 8 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
ఇక చత్తీస్ గఢ్ విషయానికి వస్తే, 90 సీట్లకుగాను, 47 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించి, అత్యంత స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, బీజేపీకి 39, ఇతరులకు 4 సీట్ల వరకూ వస్తాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి.