Titley: దూసుకొస్తున్న తిత్లీ... పెను తుపాను ముప్పులో కోస్తా!
- శర వేగంతో తీరం వైపునకు తిత్లీ
- సాయంత్రానికి పెను తుపానుగా మారే అవకాశం
- అతి భారీ వర్షాలకు అవకాశం ఉందన్న ఐఎండి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను, శర వేగంతో తీరం వైపునకు దూసుకొస్తూ, ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఆగ్నేయదిశగా, గోపాల్ పూర్ కు 410 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిత్లీ, వాయవ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం కళింగపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిత్లీ, మరో 12 గంటల్లో పెను తుపానుగా మారుతుందని, ఈ సాయంత్రానికి దాని ప్రభావం తీర ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.
తీరం వెంబడి 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, రేపు ఉదయం కళింగపట్నం, గోపాల్ పూర్ మధ్య తీరాన్ని దాటవచ్చని అంచనా వేసిన ఐఎండీ, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. తిత్లీ ప్రభావం ఉత్తరకోస్తాపై అధికంగా ఉంటుందని, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.