Yadadri Bhuvanagiri District: శరవేగంగా యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణం పనులు!
- ఏడు రాజగోపురాల్లో నాలుగు పూర్తి
- మరో ఆరు నెలల్లో భక్తులకు స్వయంభువు దర్శనం
- వచ్చే ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలతో ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించే అవకాశం
యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఆరు నెలల్లో స్వయంభువు దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. వచ్చే ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవాలతో కలిపి నిర్వహించే అవకాశం ఉంది. ఆ మేరకు చినజీయరు స్వామి ముహూర్తం నిర్ణయిస్తారని యాదాద్రి ఆలయాభివృద్ధి సంస్థ 'యాడా' వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 4.3 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న పనులను గడవులోగా పూర్తి చేయాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. స్తంభోద్భవుడి ప్రాంగణం మొత్తం కృష్ణ శిలతో మహాదివ్యంగా రూపొందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సప్త గోపురాలను నిర్మిస్తున్నారు. ఇందులో మూడు రాజగోపురాలు, గర్భాలయం దివ్యవిమాన గోపుర నిర్మాణం పూర్తయ్యాయి.
మిగతా రాజగోపురాల పనులు మూడొంతుల వరకు పూర్తికావచ్చాయి. దివ్య విమాన గోపురంపై విమాన దేవత విగ్రహాలను పొందుపరుస్తారు. గర్భాలయం చుట్టూ ప్రహ్లాదుని చరిత్ర కళ్లకు కట్టే విగ్రహాల పొందిక పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. విమాన గోపురంపై స్వర్ణకవచం తొడగాలన్న ప్రతిపాదన ఉంది. కాగా, ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా గడచిన 30 నెలలుగా స్వామి వారు బాలాయంలోనే పూజలందుకుంటూ భక్తులకు దర్శనమిస్తున్నారు.