trivikram: గెలుపు .. ఓటమి రెండింటిని త్వరగా మరిచిపోతాను: త్రివిక్రమ్
- కొంతమంది మంచి రచయితను అంటారు
- మరి కొంతమంది మంచి దర్శకుడినని చెబుతారు
- నాలోని ఆ ఇద్దరినీ విడదీసి చూడను
ఎన్టీఆర్ అభిమానులంతా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ .. తన వ్యవహార శైలిని గురించి కూడా ప్రస్తావించారు. "కొంతమంది నేను బాగా రాస్తానని అంటారు .. మరికొంతమంది బాగా తీస్తానని చెబుతారు. నేను మాత్రం నాలోని రచయితను .. దర్శకుడిని విడదీసి చూడను.
నిజం చెప్పాలంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం వుండదు. నా సినిమా హిట్ అయితే దాని గురించే అందరికీ చెబుతూ కూర్చోను. ఒకవేళ నా సినిమా ఆడకపోతే దాని గురించే ఆలోచిస్తూ బాధపడను. ఈ రెండు విషయాలను కూడా త్వరగా మరిచిపోయి, తరువాత చేయవలసిన పని గురించి ఆలోచిస్తాను. ఒక సినిమా నచ్చడానికి ఎన్ని కారణాలు వుంటాయో .. నచ్చకపోవడానికి కూడా అన్నే కారణాలు ఉంటాయనేది నా అభిప్రాయం. నిర్మాత నష్టపోయినప్పుడు నా వంతుగా నా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.