Heavy Rains: ముంచుకొస్తున్న ‘తిత్లీ’.. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
- 100 నుంచి 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- గాలుల తీవ్రత 145 కి.మీ వరకు పెరిగే అవకాశం
- ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ
- సికింద్రాబాద్-హవ్డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
తిత్లీ తుపాను ముంచుకొస్తోంది. దీని కారణంగా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి 100 నుంచి 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, గాలుల తీవ్రత 145 కి.మీ వరకు పెరిగే అవకాశముందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి, రేపు ఉత్తరాంధ్రలో 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. అలలు 7 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశాలున్నాయని.. ప్రజలు సముద్ర తీరం వద్దకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. రేపు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం-సంతబొమ్మాళి మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఏడో నంబర్.. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. తిత్లీ తుపాను కళింగపట్నానికి 230కి.మీ, గోపాల్‌పూర్‌కు 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్-హవ్డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్, బిలాస్పూర్ మీదుగా దారి మళ్లించారు.