Hyderabad: పెళ్లి చేసుకోలేదని కక్షగట్టిన యువకుడు.. మార్ఫింగ్ నగ్న చిత్రాలతో వేధింపులు.. అరెస్ట్!
- ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి బెదిరింపులు
- తొలుత యువతి ఫిర్యాదుతో అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు
- వివాహిత ఫిర్యాదుతో మరోసారి అరెస్టు
వివాహిత అశ్లీల చిత్రాలు ఫేస్బుక్లో పెట్టి వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన రంజాన్ రియాజ్ అన్సారీ (32) ప్రైవేటు ఉద్యోగి. షాదీ డాట్ కామ్‌లో ఫొటోలు పెట్టి యువతుల వివరాలు సేకరిస్తుంటాడు. అనంతరం వారిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒ యువతి ఫొటో సేకరించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తొలుత అంగీకరించిన ఆ యువతి, ఇతని ఫేస్బుక్ వ్యవహారాల గురించి తెలుసుకుని మోసగాడిగా నిర్థారించుకుంది. దీంతో పెళ్లి ప్రతిపాదనను రద్దు చేసుకుంది.
ఈ కారణంగా ఆమెపై కక్ష పెంచుకున్న అన్సారీ ఆ యువతి ఫొటోలు మార్పింగ్ చేసి వేధిస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అన్సారీని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన అన్సారీ తాను జైలుకు వెళ్లడంలో హైదరాబాద్‌లో ఉన్న యువతి బంధువు కీలకంగా వ్యవహరించిందని భావించి, ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పెళ్లయిన ఆమె ఫొటోలను సేకరించాడు. నగ్న చిత్రాలతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు.
ఈ చిత్రాల కింద సదరు వివాహిత ఫోన్ నంబరు కూడా ఇచ్చాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్స్పెక్టర్ చాంద్‌భాషా ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రలో నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. యువతులు, మహిళ ఫొటోలు మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల ద్వారా వేధిస్తున్నందున అన్సారీపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు సమాచారం.