Titley: 'తిత్లీ' ఎఫెక్ట్... గంటల వ్యవధిలో 28 సెంటీమీటర్ల వర్షం... ఇద్దరి మృతి, రద్దయిన రైళ్ల వివరాలు!
- ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి మరొకరు మృతి
- ధ్వంసమైన వేల ఎకరాల పంట
- పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల రద్దు
ఉత్తరాంధ్రను వణికించిన 'తిత్లీ' తుపాను రెండు ప్రాణాలను బలిగొంది. సారు బుజిలి మండలంలో ఓ ఇల్లు కుప్పకూలిన ఘటనలో ముద్దాల సూర్యారావు (55) మరణించగా, ఓ చెట్టు కుప్పకూలడంతో, దానికింద నిలబడివున్న తుడి అప్పల నరసమ్మ (62) అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. గత రాత్రి నుంచి గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 20 సెంటీమీటర్లకు పైగానే వర్షం కురిసింది. ఇచ్చాపురంలో 23.7, కవిటిలో 12.4, మందసలో 13.2 నందిగామ్ లో 28, టెక్కలిలో 23.4, సంతబొమ్మాళిలో 24.4, కోటబొమ్మాళిలో 24.8, జాలమూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వేల ఎకరాల్లోని అరటి తోటలు భీకర గాలుల ధాటికి నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కంబాలవలస, వీరఘట్టం మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల ధాటికి రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో యశ్వంత్ పూర్ - హౌరా ఎక్స్ ప్రెస్ (12864), బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ (12509), యశ్వంత్ పూర్ - ముజఫర్ పూర్ ఎక్స్ ప్రెస్ (15227) రైళ్లు రద్దయ్యాయి. పూరీ, విశాఖల మధ్య తిరిగే పలు పాసింజర్ రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. విశాఖ - గుణుపూర్ పాసింజర్ ను విజయనగరం వరకు, విశాఖ - న్యూ పలాస పాసింజర్ ను విజయనగరం వరకూ మాత్రమే నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.