Balakrishna: సారథి స్టూడియోలో బాలయ్యను కలిసిన టీటీడీపీ నేతలు.. గంట సేపు చర్చలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-64a54953c513ba36d4f03d96ba7992d191eada48.jpg?format=auto)
- సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్
- బాలయ్యను కలిసిన ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల
- టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని విన్నపం
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఉన్న సారథి స్టూడియోకి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీరు చర్చించారు. బాలయ్యను కలిసిన వారిలో ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో జరుగుతోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించే సన్నివేశాన్ని దర్శకుడు క్రిష్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో గత వారం బాలయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా టీటీడీపీ నేతలు బాలయ్యకు తెలిపారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని కోరారు. స్టార్ క్యాంపెయినింగ్ కోసం ముందుకు రావాలని విన్నవించారు. అన్ని చోట్ల వీలుకాకపోతే కనీసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అయినా ప్రచారం చేయాలని కోరారు. అనంతరం టీటీడీపీ నేతలు మాట్లాడుతూ, తమ విన్నపం పట్ల బాలయ్య సానుకూలంగా స్పందించారని తెలిపారు.