KCR: కేసీఆర్ తీరుతో నాకు బాధగా ఉంది.. అంతా తికమకగా ఉంది!: నాయిని ఆవేదన

  • నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్‌పై ఎటూ తేల్చని కేసీఆర్
  • అందరూ అడుగుతున్నారంటూ నాయిని ఆవేదన
  • పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్న సీనియర్ నేత

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు తీరుతో తనకు చాలా ఆవేదనగా ఉందని, అంతా తికమకగా ఉందని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మనసులోని బాధను బయటపెట్టారు. తానెక్కడికి వెళ్లినా తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్‌పై నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని, వారికి ఏం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్ టికెట్‌ను తన అల్లుడికి కేటాయించడంలో కేసీఆర్‌కు ఇబ్బంది ఉంటే తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని వివరించారు.

శ్రీనివాసరెడ్డికి టికెట్ గురించి కేటీఆర్‌ను ఇప్పటికి రెండుసార్లు కలిశానని, తనతో మాట్లాడిన తర్వాతే టికెట్‌పై నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారని, తొందరపడొద్దన్నారని నాయిని తెలిపారు. ఈ సందర్భంగా గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పగానే వద్దని కేసీఆర్ వారించారని పేర్కొన్నారు. గతంలో అక్కడ ఓడగొట్టారని, కాబట్టి ఈసారి ఎల్బీనగర్ నుంచి బరిలోకి దిగాలని సూచించారని తెలిపారు.

అయితే, డబ్బులు దండిగా ఉన్న సుధీర్ రెడ్డిపై పోటీ చేయలేనని చెప్పడంతో.. తమ్ముడిలాంటి తనపై భరోసా ఉంచాలన్నారని, పోటీ కోసం రూ.10 కోట్లు ఇస్తానని చెప్పారని పేర్కొన్నారు. అయినా, వద్దని చెప్పడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కేబినెట్‌లో చేర్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకగానే అన్ని విషయాలు ఆయనతో చర్చిస్తానని, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని నాయిని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News