petro hike: మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎక్సైజ్ సుంకం తగ్గించినా ఫలితం కరవు
- అక్కరకు రాని కేంద్రం ఉపశమన చర్యలు
- లబోదిబోమంటున్న వినియోగదారులు
ఓ వైపు కేంద్రం ఉపశమన చర్యలు చేపడుతున్నా, రాష్ట్రాలు కొంత బాధ్యత వహించాలని చెబుతున్నా పెట్రో ధర భారం వినియోగదారుడికి తప్పడం లేదు. ధరల పెరుగుదలకు బ్రేక్ పడడం లేదు. శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధర పెరిగింది. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధర నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండున్నర రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే స్థాయిలో తగ్గించాలని కోరింది.
ఎన్డీఏ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఊరటనిచ్చాయి. అయినా వినియోగదారునికి లాభం కలిగేలా పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం ఈ తగ్గింపు ప్రకటించిన తర్వాత కూడా ఎప్పటిలా పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీ, ముంబైలో లీటరు పెట్రోల్‌పై 12 పైసలు, డీజిల్‌పై ఢిల్లీలో 28 పైసలు, ముంబైలో 29 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో 82.48 రూపాయలకు, ముంబైలో 87.94 రూపాయలకు చేరింది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.74.90, ముంబైలో రూ.78.51కి చేరింది.