CM Ramesh: టీడీపీలో ఉండటమే నా నేరమా?: సీఎం రమేష్
- రేపు ఉక్కు మంత్రిని కలసి నిలదీస్తాం
- ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఓర్వలేని బీజేపీ
- ఐటీ దాడులకు బెదిరేది లేదన్న సీఎం రమేష్
తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంటే, బీజేపీ ఓర్చుకోలేక తనపై ఐటీ దాడులు చేయాలని అధికారులను ఉసిగొల్పిందని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఐటీ శాఖకు నోటీసులు పంపినందుకు దాడులు చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన నిప్పులు చెరిగారు.
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని డిమాండ్ చేస్తూ, తాను దీక్ష చేపట్టి 100 రోజులైందని, ఈ విషయంలో ఏ మాత్రం ఉలుకు, పలుకు లేని కేంద్రం, ఇప్పుడు తనపై ఐటీ దాడులతో పగ తీర్చుకుంటోందని ఆయన విమర్శలు గుప్పించారు. కడప ఫ్యాక్టరీ విషయం తేల్చాలని రేపు ఉక్కుమంత్రిని నిలదీయనున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్న తమను చూసి బీజేపీ సహించలేకపోతున్నదని ఆయన అన్నారు.
కాగా, ఈ ఉదయం ఢిల్లీలో సమావేశమైన టీడీపీ ఎంపీలు, రాష్ట్రంలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులపై చర్చించారు. ఐటీతో దాడులు చేయిస్తే బెదిరేది లేదని స్పష్టం చేసిన ఎంపీలు, రేపు తలపెట్టిన ఉద్యమ కార్యాచరణను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.