Subhash Ghai: లైంగిక ఆరోపణలు చేయడం ఫ్యాషన్ అయింది: సుభాష్ ఘయ్ ఫైర్

  • బాలీవుడ్‌లో మీటూ ప్రకంపనలు
  • ఆమిర్ దంపతుల సంచలన నిర్ణయం
  • తనుశ్రీ దత్తకు నానాపటేకర్ నోటిసులు

‘మీ టూ’ ఉద్యమం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై నిర్మాత సుభాష్ ఘయ్ స్పందించారు. ఓ మహిళకు మత్తు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాననే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘మీ టూ’ ఉద్యమంపై ఘాటుగా స్పందించిన ఆయన, పేరున్న వ్యక్తులపై లైంగిక ఆరోపణలు చేయడం ‘ఫ్యాషన్’ అయిపోయిందని విమర్శించారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఏళ్ల క్రితం ఏదో జరిగిందంటూ కట్టుకథలు చెప్పి ఒక వ్యక్తిని అపఖ్యాతి పాలు చేయడం తగదన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ నేరాన్ని రుజువు చేయాలన్నారు. లేకపోతే ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని, కోర్టుకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. తప్పు జరిగిందని ఆరోపించినప్పుడు నిరూపించాల్సిందేనని ఆయన అన్నారు. ఇలాంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తాను మహిళలకు గౌరవం ఇచ్చే వ్యక్తినని, షూటింగ్ ప్రదేశంలో కానీ, నిజ జీవితంలో కానీ తనకు ఎదురైన ప్రతి మహిళకు గౌరవం ఇచ్చానని పునరుద్ఘాటించారు.

ఇదిలావుండగా మహిమ కుక్రెజా అనే మహిళ ట్విట్టర్ వేదిగా సుభాష్ ఘాయ్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. ‘మీడియా, సాహిత్యరంగంలో చాలా విశ్వసనీయమైన వ్యక్తి’ అని పేర్కొంటూ ఓ మహిళకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి కారులో హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఘాయ్‌పై ఆరోపణలు చేసింది. అత్యాచారానికి ముందు బాధిత మహిళను ఘాయ్ అనేకసార్లు బలవంతంగా తాకడానికి ప్రయత్నించాడని, అర్ధరాత్రి సమయాల్లో షూటింగ్ ప్రదేశానికి ఆమెను పిలిచేవారిని  కుక్రెజా తన ట్వీట్‌లో పేర్కొంది. తొలుత ఏఐబీ మాజీ సభ్యుడు ఉత్సవ్ చక్రబర్తి ఓ మహిళకు తన అశ్లీల చిత్రాలను పంపించాడని పేర్కొన్నది కూడా మహిమ కుక్రెజా కావడం గమనార్హం.

ఇదిలావుండగా తనుశ్రీ దత్తా దశాబ్ద కాలం క్రితం తనపై నానాపటేకర్ లైంగిక దాడి చేశారంటూ పేర్కొన్న తర్వాత అనేకమంది బాధిత మహిళలు బయటకు వస్తున్నారు. పలు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో అలోక్ నాథ్, నానాపటేకర్, కైలాస్ ఖేర్, రజత్ కపూర్, వికాస్ భల్ ఉన్నారు.

మీటూ ప్రకంపనలు

‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. నానాపటేకర్‌పై తనుశ్రీ దత్తా  ఆరోపణలు చేసిన తర్వాత అనేకమంది ముందుకొస్తున్నారు. వింత నంద అనే టీనేజర్ టీవీ సిరీస్ రచయిత అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేశారని ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ఆరోపించింది. సంధ్యా మృదుల్, దీపిక అమిన్ అనే ఇద్దరు మహిళలు కూడా అలోక్ నాథ్‌పై లైంగిక ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా 1999లో విడుదలైన ‘హమ్ సాత్ సాత్ హై’ చిత్రంలో నటించిన ఓ నటి కూడా  ఆయనపై ఆరోపణలు చేసింది. కానీ పేరు చెప్పేందుకు ఆమె ముందుకు రాలేదు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు ఆరోపణలు చేసిన వారికి చట్టపరమైన నోటిసులు పంపిస్తున్నారు. తనుశ్రీ దత్తా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే పరువు నష్టదావా వేస్తానని నానా పటేకర్ ఆమెకు నోటీసులు పంపించారు.

ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు సంయుక్తంగా ఓ సంచలన ప్రకటన చేశారు. ఆమీర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న గుల్షన్ కుమార్ బయోపిక్ ‘మొఘల్’ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సుభాష్ కపూర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయనతో పనిచేయకూడదని వీరు నిర్ణయించామన్నారు. 2014లో విడుదలైన ‘గీతిక త్యాగి’ షూటింగ్ సమయంలో ఓ నటిపై సుభాష్ కపూర్ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడం, విషయం కోర్టు పరిధిలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమిర్ దంపతులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News